నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన గోడపత్రికను అదనపు ఉప పోలీసు కమీషనర్ ఎస్. జయరాం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం 1988 మే 31నుండి ఒక నినాదంతో ముందుకెళ్తున్నదని తెలిపారు.
ఈసారి ” పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 18 రకాల క్యాన్సర్లకు గురవడంతో పాటు గుండె జబ్బులు, టీబీ, ఊపిరితిత్తులు, అల్సర్, ఉదరకోశ వ్యాధులు, కిడ్నీ, మధుమేహం, దంత, నోటివ్యాధుల లాంటి వాటి బారిన పడనున్నట్లు చెప్పారు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి, హాని కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, జీ.వీ. రావు, బాలన్న, నేమాని విశ్వశాంతి, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.