- నిరుద్యోగుల సమస్యలు తీరే పోరాటం చేస్తాం
- ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి నిరుద్యోగులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్యమ నేత రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షుడు కొంపెల్లి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మన బిడ్డల ఉద్యోగాల కోసం పోరాడుదామని పిలుపు నిచ్చారు. విద్యార్థి, నిరుద్యోగులతో చర్చలు జరిపి, ప్రభుత్వం వాటిని తక్షణమే అమలు చేయాలని అన్నారు.
నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ..ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని అన్నారు. జులై 15న తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలకు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అయితే..నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి వారి సమస్యల పరిష్కారంపట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రభుత్వం తలుచుకుంటే.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం అసాధ్యం కాదన్న ఆయన..కేసీఆర్ ప్రభుత్వం ఒక్క జీవోతో 45 వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. టెట్ ఫలితాల తర్వాత వెంటనే డిఎస్సీకి నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన..విద్యార్థులకు ప్రిపేర్ అయ్యే సమయం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. జీవో 46 రద్దుపై వేసిన కమిటీ రిపోర్టు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మేధావుల కమిటీ, చర్చల పేరుతో నిరుద్యోగుల పోరాటంలోకి మధ్యవర్తులను పంపించి, ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందని రాజారాం యాదవ్ ఆరోపించారు. కేవలం ప్రత్యక్ష పోరాటాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచినప్పుడే విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిస్కారం దొరుకుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంచనతో రోడ్లపైకి వచ్చిన విద్యార్థి, నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లను నెరవేర్చేంత వరకు బీసీ జనసభ, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను రెచ్చగొట్టిన కోదండరాంరెడ్డి లాంటి కుహన మేధావులు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ నెల 15న తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ ముట్టడిని జయప్రదం చేయాలని వివిధ కుల, బీసీ, ప్రజా, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అన్ని బీసీ సంఘాలు సంఘటితమై నిరుద్యోగుల తరఫున జులై 15వ తేదీన సెక్రటేరియట్ ముట్టడిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగుల పోరాటానికి ఎంతటికైనా తెగిస్తామని అన్నారు.
కార్యక్రమంలో ప్రొ.గాలి వినోద్ కుమార్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమణ కుమార్, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్, ప్రముఖ అడ్వాకేట్, బీసీ సంఘం మహిళా నాయకురాలు శారదా గౌడ్, తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంకోటి ముదిరాజ్, తెలంగాణ బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్, బీసీ రిజర్వేషన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ఓయూ జేఏసీ నాయకులు లింగం శాలివాహన, కే నరసింహ యాదవ్, రాజేష్ పద్మశాలి, కృష్ణ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, వడ్డెర యాదయ్య, , పలువురు విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.