నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కేంద్రాలకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ వెళ్లి, దరఖాస్తుల స్వీకరణ పక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ వార్డు కార్యాలయంలోను, మాదాపూర్ వార్డు కార్యాలయంలోను, కొత్తూగూడ కమ్యూనిటీ హాలులోను ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కేంద్రాలను ఏర్పాటు చేశారని, పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 ఆర్థిక సహాయం, 500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, చేయూత పథకం ద్వారా వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు, కుల వృత్తుల వారికీ ఆసరా పెన్షన్ ద్వారా పెన్షన్ వంటి పథకాలను అందిచనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జనవరి 6వ తారీఖు వరకు కొనసాగుతుందని చెప్పారు. కొండాపూర్ డివిజన్ల్లో మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించటం జరిగిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.