ఓజోన్ పొర పరిరక్షణకు కృషి చేద్దాం

  • జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంపై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి లింగంపల్లి విలేజ్ లోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఆచార్యులు జి. కిషోర్ కుమార్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఓజోన్ పొర గురించి అవగాహన కల్పించారు. ఓజోన్ పొర లేకపోతే విషపూరితమైన కిరణాలు నేరుగా భూమిపై పడి సకల జీవరాసుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు.

“1980లో తొలి సారిగా ఓజోన్ పొరకు రంధ్రం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పారు. ఓజోన్ క్షీణత వల్ల మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. చర్మవ్యాధుల నుంచి మొదలుకుని చిన్న పిల్లలు, వృద్ధులకు ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని, పంటలపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు. ఓజోన్ పొర క్షీణించకుండా ఉండాలంటే విరివిగా మొక్కలు నాటడం, సౌర విద్యుత్తును ఎక్కువగా వినియోగంలోనికి తీసుకురావడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం, రసాయన పరిశ్రమలనుండి వెలువడే విషపూరిత వాయువుల తగ్గించడం, ప్రకృతి వనరులను పరిమితంగా వాడుకోవడం, వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం, శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడం లాంటివి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, విష్ణు ప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు , అధ్యాపకులు అనుపమ , జంగయ్య , జగన్ , శేషామాంబ విద్యార్థులు పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ముఖ్య అతిథి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఓజోన్ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అందరిచేత ప్రతిజ్ఞ వేయించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here