నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో నాద బ్రహ్మోత్సవ వేడుకలో ఐదవ రోజు వేంకటేశ్వరస్వామికి చేసిన స్వరార్చన రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. “భారతీయం” వ్యవస్థాపకురాలు, “పలుకు తేనెల తల్లి” సత్యవాణి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు.
అనంతరం ప్రముఖ నేపథ్య గాయకుడు “శ్రీ వేణు శ్రీరంగం” ఈ కార్యక్రమంలో “వినాయక నిను విన బ్రోచుటకు, నారాయణతే నమో నమో, ఎవ్వడెరుగును మీ ఎత్తులు, నగవులు నిజమని, గోవిందా గోవిందాయని కొలువరే, పొడగంటిమయ్య, అదిహో అల్లదిహో, ఆరగించి కూర్చున్నాడల్లవాడే, అప్పని వర ప్రసాది, ఒకపరికొకపరి, నారాయణాచ్యుతానంద, భావములోన, హరి యవతారమీతడు, తందనానా అహి” అనే అన్నమయ్య సంకీర్తనలను సమ్మోహన గానంతో రంజింపచేశారు. తబలాపై అభిషేక్, కీ బోర్డుపై రాజు వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా “భారతీయం” వ్యవస్థాపకురాలు, “పలుకు తేనెల తల్లి” సత్యవాణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అన్నమయ్య సంకీర్తనలు ముఖ్యంగా నేటి యువతకు చాలా ఉపకరిస్తాయని తెలిపారు. అన్నమయ్య సంకీర్తన కేవలం ఆధ్యాత్మికంగానే కాక అన్ని రంగాలలో ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అటువంటి అన్నమయ్య సంకీర్తనలని ప్రచారం చేసే భాగంలో శోభారాజు ఒక మహాయజ్ఞం చేశారనే చెప్పొచ్చు. అన్నమయ్యపురంలో ఈ నాద బ్రహ్మోత్సవ్ ఉత్సవంలో వేణు శ్రీ రంగం చేసిన సంకీర్తనలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. అనంతరం ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు, సంస్థ అధ్యక్షులు నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు.