- అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షాలకు నీరు నిలిచిపోయి.. పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నది. ఈ విషయమై అక్కడ నెలకొన్న సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యల పై జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ లు రజినీకాంత్ రెడ్డి, వంశీ కృష్ణ, జీహెచ్ఎంసీ ,ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన పనులు, వాటి పురోగతితోపాటు చిన్నపాటి వర్షాలకే లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోవడం, ప్రయాణీకులకు, స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అక్కడ నెలకొన్న సమస్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గోపి చెరువు నుండి వస్తున్న వరద నీరు, చుట్టు ప్రక్కల కాలనీల నుండి వస్తున్న డ్రైనేజీ నీరు ఒకే చోట చేరడం వల్ల కిందకి వెళ్లే నీటి ప్రవాహానికి ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే గాంధీ కమిషనర్ కు వివరించారు. రైల్వే బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహానికి ఏర్పడుతున్న అంతరాయానికి గల కారణాలపై ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, మరో కల్వర్టు ఏర్పాటు చేసి డ్రైనేజీ నీటిని మళ్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వకుండా చూడాలని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు కమిషనర్ రోనాల్డ్ రాస్. అనంతరం ఈర్ల చెరువు వద్ద ఎస్ ఆర్ డీపీ కింద రూ.18 కోట్లతో ఈర్ల చెరువు నుండి వస్తున్న డ్రైనేజీ నిర్మాణం చేపట్టినా టాప్ వేయకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్టు ఎమ్మెల్యే గాంధీ కమిషనర్ దృష్టికి తీసుకువెల్లగా దానికి త్వరలోనే అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి వర్షాలకు సైతం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరేదని, పలు కాలనీలు నీట మునిగేవని కానీ ఈసారి మాత్రం శేరిలింగంపల్లి వ్యాప్తంగా మొత్తంగా రైల్వే అండర్ బ్రిడ్జి, ధరణి నగర్, సిక్కుల బస్తీలో మాత్రమే సమస్యలు వచ్చాయని, ఆ మూడు చోట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ.4కోట్లతో కొత్తగా డ్రైన్ కట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయని, అలాగే మిగతా ప్రాంతాల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేమన రెడ్డి కాలనీలో సీవరేజ్ ప్లాంట్ వద్ద తరచూ సమస్య ఎదురవుతుందని, అలాగే సిక్కుల బస్తీ వద్ద నాలకు అడ్డుగా బిల్డింగ్ కట్టడం వల్ల సిక్కుల బస్తీలో నీరు నిలుస్తుందని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అలాగే జోనల్ కార్యాలయం వద్ద, కల్వరీ టెంపుల్ వద్ద మరో ఫ్లై ఓవర్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఈఎన్ సి జియఉద్దీన్, సిఈ సురేష్ కుమార్, ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్ , ఈఈ శ్రీకాంతిని, ఏ ఈ సునీల్ , ఇరిగేషన్ అధికారులు ఎస్ఈ ఆనంద్, ఈఈ నారాయణ, డిఈ నళిని, ఏ ఈ పావని, ఏఎంహెచ్ఓ నగేష్ నాయక్, కార్తిక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, పొడుగు రాంబాబు, శ్రీనివాస్ నాయక్, కృష్ణ యాదవ్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి , నటరాజ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.