శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి తెలంగాణవాసి బాధ్యత అని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. శేరిలింగంపల్లిలో సమగ్ర, సంతులిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య సదుపాయాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన శేరిలింగంపల్లి నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాల పోరాట ఫలితమని, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజల సమిష్టి కృషి వల్లే రాష్ట్రం ఆవిర్భవించిందని గాంధీ గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





