తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆత్మబలిదానాలు, యువత, ఉద్యమకారుల సుదీర్ఘ పోరాటాల ఫలితమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మసీద్‌బండ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు తగ్గడం, నీళ్లు–నిధులు–నియామకాల కోసం 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు కీలక దశకు చేరుకుందని ఆయన గుర్తుచేశారు. సకల జనుల సమ్మె, రైల్‌రోకో, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో పాటు ఎందరో అమరవీరుల త్యాగాలు, యువత, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని రవికుమార్ యాదవ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అమరవీరులు, ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాయని, కానీ వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఉద్యమకారుల గుర్తింపు కార్డుల జారీతో పాటు వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై కూడా ఉద్యమం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు కిశోర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, రాజు శెట్టి, సీనియర్ నాయకులు సదానంద్ యాదవ్, కాంచన కృష్ణ, రమేష్, శ్రీశైలం, శ్రీను, వెంకటేష్, మహేందర్ యాదవ్, రాజేష్, అజయ్, శ్రీకాంత్, అరుణ్, దేవేందర్, విజయలక్ష్మి, మీనమ్మ, జ్యోతి, రాణి, స్వప్న, సహదేవ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here