అర్థరాత్రి బెల్ట్ షాపులపై ఆరెకపూడి గాంధీ దాడి.. నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగింత..

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి స్వయంగా వెళ్లి చర్యలు చేపట్టారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు స్పందించిన ఆయన బెల్ట్ షాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీసు, ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కాలనీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల‌ను నిర్వహిస్తూ నకిలీ మద్యం విక్రయాలు జరుపుతున్నారని, దీనివల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని మహిళలు విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన గాంధీ అర్థరాత్రి అక్కడికి చేరుకుని అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బెల్ట్ షాపుల ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వారిని ఎంతటి ప్రభావశీలులు అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నకిలీ మద్యం విక్రయాలపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కల్తీ మద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత, ప్రశాంత జీవనమే తనకు ముఖ్యమని పేర్కొన్న గాంధీ, బెల్ట్ షాపుల కారణంగా పేద కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన పీఏసీ చైర్మన్‌కు మహిళలు, కాలనీ వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ డి.ఐ. రమేష్ నాయుడు, ఎస్‌ఐ కృష్ణయ్య, ఎక్సైజ్ సిబ్బంది, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here