- ముత్యాల ముగ్గుల పోటీల్లో అలరించిన రంగవల్లులు
- విజేతలకు బహుమతులు అందజేసిన న్యాయ నిర్ణేతలు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్ షిప్ (రాజీవ్ స్వగృహ), నేతాజీ నగర్(గుల్ మొహర్ పార్క్) లలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ఉన్నతిని చేకూర్చే చేతి కళగా ముగ్గులను గుర్తించి కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్ , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలే పండుగలని అన్నారు. ధనుర్మాసంలో మహిళలు ఇంటి ముందు అందమైన, కళాత్మకమైన రంగవల్లులు వేయడం భారతీయ సనాతన సంప్రదాయం అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను అందించటమే లక్ష్యంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల వల్ల మహిళలు వారిలో దాగున్న సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కాలనీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదు ప్రోత్సాహక బహుమతులను విజేతలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా తాటిచెర్ల వరలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు విజయలక్ష్మి, సుశీల, సుధ, సత్య, సత్యవాణి, త్రివేణి , కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు M. S. రావు, పాలం శ్రీను పాల్గొన్నారు.