- ఏజెన్సీ చేపట్టిన అపార్ట్ మెంట్ తవ్వకాల్లో కూలిన పక్కన ప్రహరీ
- పర్యటించిన మొవ్వ సత్యనారాయణ
నమస్తే శేరిలింగంపల్లి: ఓ ఏజెన్సీ ఒక అపార్ట్ మెంట్ లో చేపట్టిన సెల్లర్ తవ్వకం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, నల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర శ్రావ్య – స్వాతిక అపార్ట్ మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్ మెంట్ ను ఆనుకోని ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో సెల్లర్ తవ్వకం చేపట్టారు.
వర్టెక్స్ ఏజెన్సీ చేపట్టిన లోతైన సెల్లార్ తవ్వడం వల్ల పక్కనున్న అపార్ట్ మెంట్ కృంగిపోయింది. ఒక్కసారిగా ఏమైందో తెలియక స్థానికులు భయందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్టెక్స్ కంపెనీ పెద్దపెద్ద భవనాలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారన్నారు. గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఏ నేపథ్యంలో సెల్లార్ గుంత తీయడం వల్ల దీనికి ఆనుకొని ఉన్న ప్రహరీ కూలిపోయిందని తెలిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన అక్కడివారు ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి తరలి వెళ్లారని, ఈ నష్టానికి పూర్తి బాధ్యత వర్టెక్స్ ఏజెన్సీ, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఏజెన్సీల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అపార్ట్ మెంట్ వాసులకు భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరదల నరేష్, మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చిట్టా రెడ్డి ప్రసాద్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.