- మధుర బంకేట్ హాల్ లో స్వర్గీయ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ
- కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కమ్మసంఘం సభ్యులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- నివాళులర్పించి ఆయన సేవలు కొనియాడిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధి జీఎస్ఎం మాల్ లోని మధుర బంకేట్ హాల్ లో పటాన్ చెరువు, శేరిలింగంపల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కమ్మసంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే , కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెకపూడి గాంధీ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నిఒడిదోడుకులు ఎదురైన తాను ఎంచుకున్న ప్రతి రంగంలో విజయం సాధించిన పద్మ విభూషన్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే తన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతులకు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటూ వారికి సలహాలు ఇచ్చేందుకు అన్నదాత పత్రికను స్థాపించి కోట్లాది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
రామోజీ ఫిలిం సిటీ ని నిర్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.
తెలుగు మీడియా రంగంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నరు రామోజీ రావు, ఈనాడు దినపత్రిక ద్వారా తన కలంతో ఒక సమాజాన్ని ప్రభావితం చేసిన ఆయన ఇక లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిదన్నారు. తన లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారని ఆయన సేవలను కొనియాడారు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు బండి రమేష్, పఠాన్ చెరువు కమ్మసంఘం అధ్యక్షులు తాళ్లూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొల్లి వెంకటేశ్వర రావు, కోశాధికారి పాపారావు , విజేత సూపర్ మార్కెట్ ఎండి జగన్మోహన్ రావు, సుబ్బారావు, అడపా రామారావు, రాఘవేంద్రరావు, నరేంద్ర ప్రసాద్, సూర్యనారాయణ, ప్రసాద్, మండవ వేణు, బాలకృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.