గేటెడ్ కమ్యూనిటీలు ర‌క్త‌దానంలో ముందుండాలి… ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ వాసుల‌ను అభినందించిన సీపీ స‌జ్జ‌నార్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కోవిడ్ విజృంభ‌న స‌మ‌యంలో తగ్గిపోతున్న రక్త నిల్వల్ని పెంచేందుకు గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఆదివారం మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో జరిగిన ‘ట్రెడా’ రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో బయటికి ఎవరూ రాకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీల్లోకే వెళ్లి రక్తదాన శిబిరాల్ని ‘ట్రెడా’ నిర్వహించడం స్వాగతిస్తున్నానని తెలిపారు. తలసేమియా, క్యాన్సర్ వంటి రోగులకు అత్యవసరమైన రక్తాన్ని గేటెడ్ కమ్యూనిటీలకే వెళ్లి సేకరించడం చక్కటి ఆలోచన అని నిర్వాహకుల్ని ప్రశంసించారు. కొవిడ్ పరిస్థితిల్లో ధైర్యంగా ముందుకొచ్చి రక్తమిచ్చిన ఎస్ఎంఆర్ వినయ్ సిటీ నివాసితుల్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్రెడా ఉపాధ్యక్షుడు మేకా విజయ్ సాయి మాట్లాడుతూ.. ’ట్రెడా’ సభ్యులున్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వరుసగా రక్తదాన శిబిరాల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్‌సీఎస్‌సీ, సేవా భారతి ఫౌండేషన్ ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో పాల్గొనేందుకు గేటెడ్ కమ్యూనిటీలన్నీ ముందుకు రావాలని కోరారు.

ర‌క్త‌దానం చేసిన ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ వాసుల‌కుప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌తో విజ‌య్‌, శ్రీకాంత్, జాన్స‌న్

ఎస్‌సీఎస్‌సీ సభ్యుడు శ్రీకాంత్ బాడిగ మాట్లాడుతూ.. గతేడాది నుంచి హైదరాబాద్లోని దాదాపు పదిహేడు బ్లడ్ బ్యాంకులకు అవసరమయ్యే రక్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కొవిడ్ కాలంలో ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ సెంటర్లు, బెడ్లు, ఆంబులెన్సులు, ప్లాస్మా డొనేషన్ వంటివి విజయవంతంగా చేపడుతున్నామని వివరించారు. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రెసిడెంట్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన తమ సభ్యులకు, నివాసితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రెడా కోశాధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి అందజేసే రక్తం వల్ల కనీసం ముగ్గురు పేషెంట్లకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి ఫౌండేషన్ సభ్యులు, మియాపూర్ సీఐ వెంకటేష్, సంఘ సభ్యులు శరత్ బాబు, సురేష్, సతీష్, నిధి గర్గ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here