
నమస్తే శేరిలింగంపల్లి: మహబూబాబాద్ జిల్లా గుగులోత్ తాండాకు చెందిన గిరిజన మైనర్ బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్( AIBSS ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన బాలిక ఉషను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలన్నారు. ఘటన పై సమగ్ర విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టంలోని లోపాలను సరిదిద్దాలన్నారు. దిశ హత్యాచార కేసులో చేసిన న్యాయమే ఉషకు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం కాకుండా బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం అందించాలని, విచారణ వేగంగా జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాలన్నిటినీ ఏకం చేసి న్యాయపోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. గత కొంత కాలంగా గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని, బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన బాధితులకు న్యాయం చేసి భరోసా కల్పించాలని కోరారు.