శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న రాగం సతీష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని ఆలయం ఆవరణలో తాము చేసిన పోరాటం ఫలితంగానే నేడు యాదవులకు సముచిత స్థానం కల్పిస్తూ చైర్మన్ పదవిని యాదవులకు కేటాయించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాలు, ఉద్యోగులు, పట్టభద్రుల మద్దతుతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రాగం సతీష్ యాదవ్ చెప్పారు. అనంతరం కొండ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సురేష్ ముదిరాజ్, పరమేష్ రాయ్, వినయ్ ముదిరాజ్ ఉన్నారు.
