మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెల్లాపూర్‌కు చెందిన ల్యాబ్ టెక్నిషియన్ దాసరి మధు (21), అదే ప్రాంతానిఇక చెందిన కర్రనోళ్ల కరుణాకర్‌లు ఈ నెల 23వ తేదీన రాత్రి 9.15 గంటల సమయంలో ప్రగతి నగర్ నుంచి తెల్లాపూర్ వైపుకు వస్తున్నారు. కాగా మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం (ఏపీ23కే1208) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెనుక భాగంలో కూర్చుని ప్రయాణం చేస్తున్న కరుణాకర్ రోడ్డుపై పడి తీవ్ర గాయాలకు గురై స్పాట్‌లోనే చనిపోయాడు. బైక్ నడిపిస్తున్న మధు హెల్మెట్ ధరించి ఉన్నందున స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

