శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, నేరాల దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో 26 సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్ కుమార్ సూచనల మేరకు బీఎస్ఎన్ఎల్ ఎక్స్ రోడ్, హుడా కాలనీ ఎక్స్ రోడ్, ఆర్యూబీ ఎక్స్ రోడ్, నల్లగండ్ల అండర్ బ్రిడ్జ్, లింగంపల్లి రైల్వే స్టేషన్, లింగంపల్లి రైతు బజార్, గోపనపల్లి ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నేరాల నివారణ దృష్ట్యా ఈ ప్రాంతాలను కీలకంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో భాగంగా చందానగర్‌కు చెందిన సామాజిక సేవకుడు మిర్యాల రాఘవరావు రూ.3 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి భద్రతా చర్యలకు సహకరించినందుకు పోలీసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులను వారం రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చందానగర్ ప్రాంత ప్రజలకు, కాలనీ పెద్దలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తూ, దొంగతనాల నివారణ, నేరాల గుర్తింపు, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఇంటి ముందు రహదారి కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.





