జయశంకర్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలి: బీజేపీ నేతలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 6 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్‌లో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో హుడా కేఫ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, బీజేపీ సీనియర్ నాయకుడు, టీఏసీ సభ్యుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు.

పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది అనే భావజాలంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లో నింపిన జయశంకర్ ఆశయాలను ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు, శేఖర్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, రామ్ రెడ్డి, శ్రీకాంత్, లోకేష్, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here