శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరారు. ఈ మేరకు యూసఫ్‌గూడలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) దక్షిణ విభాగం కార్యాలయంలో ఇన్స్పెక్టర్ జనరల్ తుమ్మల విక్రమ్‌ను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో ఇప్పటికే పలు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. నడిగడ్డ తండాలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల నిర్మాణంతోపాటు భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పైప్‌లైన్ పనులు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని CRPF అధికారులను కోరారు.

మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 600 నుంచి మెట్రో స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా CRPF అధీనంలోని స్థలంలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని గాంధీ విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేస్తే ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు ఆదా కావడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
నడిగడ్డ తండా నుంచి బొల్లారం రోడ్డులోని HDFC బ్యాంకు సమీపంలో మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాంధీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యూజీడీ పైప్‌లైన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తే పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మురుగునీటి సమస్య పరిష్కారంతో కాలనీలో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. నడిగడ్డ తండాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని గాంధీ హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
గాంధీ ప్రస్తావించిన అంశాలపై CRPF దక్షిణ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ తుమ్మల విక్రమ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో CRPF అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎస్ఈ శ్రీకాంతిని, ఏఈ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





