శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ చైతన్య నగర్ కమ్యూనిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

అనంతరం తెల్లాపూర్‌లో చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిని పరిశీలించడంతోపాటు, హుడా కాలనీలో మోడల్ రోడ్డు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. హుడా కాలనీ పార్కును సందర్శించి పార్కు అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీల్లో మెరుగైన రహదారులు, పట్టణ సౌకర్యాలు కల్పించడంతోపాటు బహిరంగ ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సర్కిల్ అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నిర్ణీత కాలపరిమితిలో అన్ని పనులు పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు సంబంధిత సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.





