శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): లక్ష్మీస్ ఎంపీరియా గేటెడ్ కమ్యూనిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కాలనీ వాసులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సుమారు 450 కుటుంబాలు నివసిస్తున్న ఈ కమ్యూనిటీలో చిన్నారులు, యువత క్రీడల్లో ప్రతిభను చాటుకునేందుకు అవసరమైన ప్రాథమిక వసతులు లేవని కాలనీ ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇందులో భాగంగా రూ.2.20 లక్షల విలువైన మూవబుల్ క్రికెట్ నెట్, రూ.80 వేల విలువైన బ్యాడ్మింటన్ నెట్స్ కొనుగోలుకు మొత్తం రూ.3 లక్షల నిధులు అవసరమవుతాయని తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిధుల నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేయించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రవికుమార్ యాదవ్, ఈ సమస్యను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పరాజు శ్రీనివాస్, ప్రతినిధి తంగెళ్ల శివ నరసింహ రాజు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.





