శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని, వాటిని వేలం వేసి వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శనివారం సీపీఎం నాయకుల బృందం మియాపూర్ భూముల్లో పర్యటించింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వ భూములను వేలం వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సరైన విధానం కాదని అన్నారు.

ప్రభుత్వ భూములను కేవలం ఆదాయం సమకూర్చుకునే వ్యాపార వస్తువులుగా చూడకూడదని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇళ్లు లేని లక్షలాది మంది నిరుపేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వ హామీ మేరకు మియాపూర్ భూములను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ భూములను పేదలకు కేటాయించకుండా బడా బాబులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తే సీపీఎం పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మియాపూర్ ప్రాంతంలోని ఈ భూముల్లో సుమారు 15 వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నాయని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయకూడదని సూచించారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న కాలనీవాసులకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ భూములను రక్షించాలని, రాష్ట్ర సంక్షేమానికి దోహదపడే విధంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని జాన్ వెస్లీ తెలిపారు. ప్రభుత్వ భూములను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించడంతో పాటు, ఇప్పటికే నివసిస్తున్న కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.





