లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు, సాధారణ ప్రజలకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, నకిలీ పోలీసు ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ పెట్టుబడుల మోసాలు, నకిలీ ఉద్యోగ, రుణ ఆఫర్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు.

అలాగే గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, తెలియని వనరుల నుంచి ఏపీకే (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, బెదిరింపు కాల్స్ లేదా మోసపూరిత సందేశాల ఆధారంగా ఎవరికీ డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు సైతం సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, డీఐ నవీన్, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య, స్టేషన్ మాస్టర్ రాజు, సీసీఐ స్వామి, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్, సైబర్ వారియర్ నర్సమ్మతో పాటు పోలీసు, రైల్వే సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు శాఖ, ఆర్‌పీఎఫ్, జీఆర్పీ, రైల్వే అధికారుల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here