శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ పేదలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి, వారి నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని యంసిపిఐ(యు) నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా మిగులు ప్రభుత్వ భూములను ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయడంతో పాటు ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని కోరింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ సి. చంద్రారెడ్డికి నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో గత నాలుగు దశాబ్దాలుగా స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ బస్తీల ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్లు 505, 166, 58 ప్రకారం తమ నివాసాలకు పట్టాలు మంజూరు చేసి చట్టబద్ధత కల్పించాలని బాధితులు పలుమార్లు ప్రభుత్వాలకు దరఖాస్తులు సమర్పించినట్లు వివరించారు. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొన్ని ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు ఆర్డీవో ద్వారా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో ఇంటి పట్టాలు మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సర్వే నంబర్లు 100, 101లోని భూమి మొత్తం ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇంటి పట్టాలు జారీ చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మిగులు భూములను ఇళ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా మిగులు భూముల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, 200 పడకల ఆసుపత్రి, ఓపెన్ క్రీడా స్టేడియం, మార్కెట్ యార్డు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, పెట్టుబడిదారులకు విక్రయించకుండా ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, తాండ్ర కళావతి, కమిటీ సభ్యులు జి. శివాని, డి. నరసింహ తదితరులు పాల్గొన్నారు.





