శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పారామం ఎదురుగా ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ నాయక్ ఆధ్వర్యంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మియాపూర్ కాంగ్రెస్ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్తో కలిసి ఆయన ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాసంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ధైర్యసాహసాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వం, దేశం పట్ల అంకితభావంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని గుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాల్లో ఆమె హయాంలో తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, గిరిబాబు, కృష్ణ, గోపాల్ నాయక్, లతీఫ్, కవి రాజు, మొయిన్, మూర్తి, విజయ్, అశోక్, ప్రేమ్ కుమార్, మహిళా కాంగ్రెస్ మండల్ అధ్యక్షురాలు సునీత రెడ్డి, పార్వతి, శ్రీజ రెడ్డి, శశిరేఖ, శాంత, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.





