హోటల్ బుకింగ్ పేరుతో సైబర్ మోసం.. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో స్వాహా..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. హోటల్ బుకింగ్, రీఫండ్ పేరుతో ఒకరిని, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయంటూ మరొకరిని నమ్మించి నగదు కాజేశారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు మొత్తం రూ.2,17,850 నష్టపోయారు. ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ఉన్న హోటల్ పెర్లిన్‌లో హోటల్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. హోటల్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి 8130435185 మొబైల్ నంబర్ నుంచి ఆమెను సంప్రదించాడు. హోటల్ బుకింగ్, రీఫండ్ ప్రక్రియ పేరుతో విడతల వారీగా డబ్బులు చెల్లించాలని సూచించడంతో ఆమె నమ్మి మొత్తం రూ.81,950 చెల్లించింది. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.1,35,900 మోసం..

మరో ఘటనలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1,35,900 వసూలు చేశారు. ఫిర్యాదుదారుడు జూలై 27న ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటన చూసి WorthWhiz Financial Services వెబ్‌సైట్‌లో చేరాడు. నిఖిత అనే మహిళ గ్రూప్ అడ్మిన్‌గా పరిచయం చేసుకుని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో లాభాలు పొందవచ్చని నమ్మించింది. ఆమె సూచనల మేరకు ఫిర్యాదుదారుడు తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.1,35,900 బదిలీ చేశాడు. అయితే, నిందితులు రోజువారీ ట్రేడింగ్ సూచనలు ఇవ్వకపోవడంతో పాటు, పెట్టుబడుల్లో వచ్చిన నష్టాలపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఆగస్టు 6న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు. దీంతో రూ.1,35,900 మొత్తాన్ని హోల్డ్‌లో ఉంచారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బుకింగ్ లేదా రీఫండ్ పేరుతో డబ్బులు అడిగినా, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చినా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here