ఘ‌నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యతా దినోత్సవం), మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలను చందానగర్‌లో నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని డఫ్ అండ్ డమ్ (చెవిటి, మూగ పిల్లల) పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు, బిస్కెట్లు, పండ్లు, పాప్‌కార్న్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారని తెలిపారు. మహాత్మాగాంధీ ఆయనకు సర్దార్ బిరుదును ప్రదానం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని, హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాల విలీనంలోనూ ముఖ్యమైన బాధ్యత నిర్వహించారని వివరించారు. దేశ తొలి ఉప ప్రధానిగా, కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన ఆయన ఆధునిక అఖిల భారత సర్వీసుల వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించిందని, ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు.

అనంతరం ఇందిరాగాంధీ సేవలను ప్రస్తావిస్తూ.. దేశ తొలి మహిళా ప్రధానిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రిగా, అలీన దేశాల ఉద్యమంలో కీలక నాయకురాలిగా ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో, అణు పరీక్షలకు ప్రోత్సాహం అందించడంలో ఆమె పాత్ర ఉందన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిణామాల్లో ఇందిరాగాంధీ నాయకత్వం కీలకమైందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా గరీబీ హటావో నినాదంతో పాటు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన మహిళా నాయకురాలిగా, ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గుర్తింపు పొందారని తెలిపారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీల జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ధైర్యంగా సమాజంలోని సమస్యలను ఎదుర్కొంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలని రామస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాల్గొన్న వారితో జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, జనార్ధన్, వాణి సాంబశివరావు, పాలం శ్రీను, పాఠశాల ప్రిన్సిపాల్ మెర్సీ, ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here