శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI-కృత్రిమ మేధ) ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పు తెస్తోందని, ఇది రోగ నిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణలో అనేక విధాలుగా సహాయపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కృత్రిమ మేధ AI-ఆధారిత సాంకేతికతలు రోగి వైద్య నివేదికలను విశ్లేషించడంలో, వ్యక్తిగత చికిత్స ప్రణాళికలను రూపొందించడంలో, మందులను అభివృద్ధి చేయడంలో వైద్యులకు ఎంతగానో సహాయపడుతున్నాయని అన్నారు. విప్లవాత్మక ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భాగస్వామ్యం అనే అంశంపై దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాన్ని మాదాపూర్ డివిజన్ పరిధిలోని యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, AI సాంకేతిక నిపుణులు సహా 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు & చైర్మన్ గోరుకంటి రవీందర్ రావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, మాట్లాడుతూ సాంకేతికతతో కూడిన రోగి సంరక్షణ, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో కీలకం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి వేదికల వల్ల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI-కృత్రిమ మేధ) ప్రాముఖ్యతపై అవగాహనను పెంచుతుందని, కృత్రిమ మేధ సాంకేతికతలను సమర్థవంతంగా స్వీకరించడంలో ఆరోగ్య సంరక్షణ సంస్థలకు మద్దతిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండటానికి కట్టుబడి ఉంటుందని, ప్రజారోగ్యం, పౌర సేవల్లో కృత్రిమ మేధస్సు AI పరివర్తన పాత్రను ఆయన వివరించారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, వ్యవస్థాపకులు & చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణలో సంక్లిష్టమైన వైద్య-ఆరోగ్య సంరక్షణ డేటాను విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధ (AI) ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో, ఇది వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించడానికి, సరైన చికిత్స చేయడానికి, వ్యాధుల నివారణకు వేగవంతమైన మార్గాలను అందించడంలో మానవ నిపుణులతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయగలదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది వైద్య వ్యవస్థలో వైద్యులను భర్తీ చేయడానికి రుపొందించబడింది కాదని, వారి సామర్థ్యాలను పెంపొందించడానికి, మరింత మెరుగుపరచడానికి రుపొందించిందని అన్నారు. అయితే, ఆరోగ్య సంరక్షణలో AI ని ఉపయోగించడంలో కొన్ని నైతిక, సామాజిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు. డేటా గోప్యత, పారదర్శకత, AI వ్యవస్థల ద్వారా వివక్ష వంటి అంశాలపై అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. కృత్రిమ మేధస్సు AI ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, దాని అభివృద్ధి, ఉపయోగంపై ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, క్లినికల్ డైరెక్టర్ & రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మకమైన చారిత్రక మార్పు. క్లినికల్ ప్రాక్టీస్ లో కూడా కృత్రిమ మేధస్సు అద్బుతాల్ని సృష్టిస్తుంది. AI అల్గోరిథంలు రోగి వైద్య నివేదికలు (ఎక్స్-కిరణాలు, MRIలు) విశ్లేషించడంలో, వ్యాధులను, ముఖ్యంగా క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో మానవ నిపుణులతో సమానంగా లేదా కొన్ని సందర్భలలో అంతకంటే మెరుగ్గా పనిచేయగలదు అని అన్నారు. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను తొలిదశలోనే గుర్తించడంవల్ల వాటికి సరైన సమయంలో అత్యుత్తమ చికిత్స, వ్యాధి నివారణలో కూడా మనం ఎంతో ప్రగతి సాధించవచ్చు. రోగ నిర్ధారణ పరీక్షలలో అయితే ఈ కృత్రిమ మేధ విశ్లేషణలతో, అత్యాధునిక చికిత్సా పద్దతులతో డాక్టర్లు అద్బుతాలు సృష్టించగలరు. తద్వారా, రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని అన్నారు. ఈ సదస్సులో డయాగ్నస్టిక్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, AI-ఎనేబుల్డ్ పర్సనలైజ్డ్ ఆంకాలజీ, AI-డ్రివెన్ రోబోటిక్ ప్రెసిషన్ సర్జరీ, ఫార్మా, హాస్పిటల్ ఆపరేషన్లలో ఇన్నోవేషన్, ఎథికల్ AI, పబ్లిక్ హెల్త్, పాలసీ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు డాక్టర్. చినబాబు తెలియజేశారు.