శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ – చందా నగర్ మంజీర పైప్ లైన్ రోడ్డువిస్తరణ, అభివృద్ధి చేయాలని కోరుతూ భాజాపా ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఊసరవెల్లిలాగా పార్టీలు మారుతూ ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిత్యం నరకయాతన పడుతూ వేలాది మంది వాహనదారులు ఉద్యోగాలకు వెళ్లాలన్నా, బయటకు వెళ్లి వ్యాపారం చేసుకోవాలన్నా ,చదువుకునే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా రోడ్ల పరిస్థితి బాగాలేక నరకం చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ నాయకత్వంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ సమక్షంలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్ అధ్యక్షతన హఫీజ్‌పేట్ మంజీరా రోడ్డు నుండి చందానగర్ మున్సిపల్ కార్యాలయం వరకు ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, వేసవికాలం మొత్తం విశ్రాంతి తీసుకుని బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ప్రజా ప్రతినిధుల అలసత్వం వలన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను భారతీయ జనతా పార్టీ భుజాలపై వేసుకొని సమస్యల పరిష్కార దిశగా ప్రజా పోరాటం చేస్తున్నామని అన్నారు. వర్షాకాలం నెత్తిమీదికి వచ్చిన సమయంలో అధికారులు ఇప్పుడు మత్తు నిద్ర వదిలి ఎక్కడ రోడ్డు అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే వదిలే ప్రసక్తే లేదని అధికారులను, ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తున్నామని అన్నారు.
నిలిచిపోయిన రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కి రోడ్ల సమస్యలపై వినతి పత్రం అందజేసి జిహెచ్ఎంసి కార్యాలయానికి వెళ్లి అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ , కో -కన్వీనర్, రాష్ట్ర జిల్లా డివిజన్ మాజీ- నూతన అధ్యక్షులు, మహిళా మోర్చా, యువ మోర్చా, వివిధ కాలనీ వాసులు, ఆదిత్య అపార్ట్మెంట్స్, వినాయక నగర్, ప్రకాష్ నగర్, ఏపీ ఎన్జీవో కాలనీ, సాయిరాం టవర్స్, వైశాలి నగర్, ఆల్విన్ కాలనీ , మైత్రి నగర్ , మదీనాగూడ , కల్కి హైట్స్ , ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జెవెల్, ఇంజనీరింగ్ ఎంక్లేవ్, హుడా కాలనీ, గంగారం కాలనీవాసులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.