శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు , ఏ ఐ టి యు సి, ఏ ఐ యు సి టి సంఘాల ఆధ్వర్యంలో చందానగర్ మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం నుండి వివిధ రంగాల కార్మికులను కలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష కార్మిక సంఘం నాయకులు కృష్ణ, చందు, శివాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని సమ్మెలో భాగంగా చందానగర్లో ర్యాలీ నిర్వహించినమని తెలిపారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకువస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర పోరాట కాలం నుండి కార్మికుల హక్కులను సాధించుకున్నారని వారు గుర్తు చేసుకున్నారు. సాధించిన కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని వారు తెలిపారు. ఒకవైపు దేశంలో రోజు రోజుకీ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంటే కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం చట్టాలను మారుస్తూ కార్మికులను పూర్తిగా బానిసలుగా చేసే విధంగా విధానాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కార్మికులకు ఏమాత్రం సౌకర్యాలు కల్పించకపోగా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తూ పనిగంటలను పెంచుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం 10 గంటల విధానానికి 282 జీవో తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్మికులంతా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు చల్లా శోభన్, కార్మిక సంఘాల నాయకులు రాములు, మురళి, దశరథ నాయక్, నాగమణి, శ్రీలత, నీరజ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.





