శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి గురుపూజల సందర్భంగా భారతీయం ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్థ లబ్ద ప్రతిష్టులైన సాహిత్యకారులను సత్కరించుకుంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పత్రికా మాధ్యమంలో భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రచారం చేయడంలో తమవంతు కృషి చేసిన మహనీయులను మదీనా గూడలో ఉన్న ధర్మపురి వేదిక మీద సత్కరిస్తోందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ సభలో చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ రచించిన సిందూరం పుస్తకం ఆవిష్కరణ జరుగుతుందన్నారు. పహల్గామ్ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు ఈ రచనలో చర్చించబడ్డాయని తెలిపారు. ఈ పుస్తక రచయితను సత్కరించుకోవడం మన బాధ్యత అని భారతీయం వ్యవస్థాపక అధ్యక్షురాలు జి. సత్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు.






