శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొల్లూరు మండలం రాళ్ల బౌజారా అనే గ్రామానికి చెందిన గుర్ర వెంకట రామారావు (28) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి రాపిడోలో 2 వీలర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం నల్లగండ్ల ఫ్లై ఓవర్ పై సిగ్నల్ వద్ద రామారావు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన రెడీమిక్స్ లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.