చందానగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో PAC చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. సత్యాగ్రహాన్ని ఆయుధంగా, అహింసా మార్గాన్ని అనుసరించి పోరాడిన మహాత్మా గాంధీ కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాడిన నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యుడని గాంధీ పేర్కొన్నారు. సత్యం, అహింస ఆయన సిద్ధాంతాలకు మూలస్తంభాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన పోరాట ఆయుధాలని తెలిపారు.

సాధారణ జీవనశైలిని అనుసరిస్తూ, స్వయంగా నూలు వడుకుతూ, మురికివాడలను శుభ్రం చేస్తూ, అన్ని మతాలు, కులాలు సమానమేనని చాటిన గొప్ప మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఎల్లవేళలా అనుసరణీయమని అన్నారు. దేశ పురోగతికి మహాత్మా గాంధీ అందించిన సేవలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ముఖ్యంగా నేటి యువత ఆయన బాటలో నడవాలని ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here