ఎన్నో ఏళ్ల కిందట కొన్న వాహనాలను ఇప్పటికీ మీరు వాడుతున్నారా ? అయితే ఇకపై మీకు ఆ అవకాశం లేదు. అవును, ఎందుకంటే త్వరలో కేంద్రం కొత్త చట్టాన్ని తేనుంది. దాని ప్రకారం ఇక మీరు పాత వాహనాలను రహదారులపై తిప్పలేరు. కేవలం స్క్రాప్ కింద అమ్ముకోవాలి. లేదంటే ఇంట్లో పెట్టుకోవాలి. కేంద్రం ఇందుకు గాను ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని సభలో ఆమోదించనున్నట్లు సమాచారం.
పాత వాహనాల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ఆటో మొబైల్ రంగం కూడా కుదేలైంది. ఈ క్రమంలో ఆ రంగానికి ఊతం ఇచ్చేందుకు, వాటిపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ఆ కొత్త చట్టాన్ని తెస్తుందని సమాచారం. దీంతో పాత వాహనాలను ఆటో ఇండస్ట్రీలు స్క్రాప్ కింద కొంటాయి. వాటిని రీసైకిల్ చేస్తాయి. నూతనంగా వాహనాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో పరిశ్రమలకు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. అలాగే దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చు. అందుకనే కేంద్రం పాత వాహనాలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో దీనిపై ఏం ప్రకటన చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.