దేశంలో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చికెన్, గుడ్లను తినడంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధించాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను గుర్తించి వాటిని పూడ్చి పెడుతున్నారు.
కాగా పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధించడంపై కేంద్రం ప్రకటన చేసింది. ఇప్పటికే కోవిడ్ వల్ల పౌల్ట్రీ, మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధిస్తే వారు మరింత నష్టపోతారని పేర్కొంది. పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధించవద్దని, తగిన జాగ్రత్తలో ఆయా ఉత్పత్తులను అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సూచించింది. చికెన్, గుడ్లను తినడంపై ప్రజల్లో నెలకొన్న భయాలను, అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, బాగా ఉడకబెట్టిన చికెన్, గుడ్లను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.