మాదాపూర్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌ స్వాతి హైస్కూల్‌ ఆవరణలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలతో సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్య సాధనకు మార్గం చూపారని పేర్కొన్నారు.

అంటరానితనం నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, గ్రామ స్వరాజ్యం, మహిళల రక్షణ, సాధికారతతో పాటు స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని గాంధీజీ ఆకాంక్షించారని తెలిపారు. దళితులకు దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో శాంతి, సుస్థిరత కోసం గాంధీజీ చూపిన అహింసా మార్గం ఎంతో ప్రాధాన్యమైనదని రామస్వామి యాదవ్‌ అన్నారు. ఐక్యరాజ్యసమితి అక్టోబర్‌ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించడం భారతీయులకు గర్వకారణమని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో సమైక్యత, సమగ్రత ఎంతో అవసరమని, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతీయ సమాజంలో ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి సేవలను స్మరించుకుంటూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, మాజీ రైల్వే, హోం శాఖ మంత్రిగా, భారతదేశ రెండవ ప్రధానిగా ఆయన విశిష్ట సేవలందించారని కొనియాడారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు శాస్త్రిజీ ప్రతీకగా నిలిచారని తెలిపారు.

1965 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్ఫూర్తినిచ్చారని, జై జవాన్‌.. జై కిసాన్‌ నినాదంతో దేశాన్ని ఉత్తేజపరిచారని గుర్తుచేశారు. నేటి యువత శాస్త్రిజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అవినీతి, స్వార్థపూరిత ఆలోచనలను విడనాడి సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ చంద్రిక, అధ్యాపకులు, విద్యార్థులు, ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, శివరామకృష్ణ, జి.వి.రావు, సత్యనారాయణ, నండూరి వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here