శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ, ఎస్‌డీపీ నాలా, ఎస్‌టీపీ లైన్, రోడ్ల అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులు గురువారం కమిషనర్ జి. సృజనకు వినతిపత్రం సమర్పించారు. మియాపూర్, మాదాపూర్, హైదర్‌నగర్ డివిజన్లలో చేపట్టిన డ్రైనేజీ, ఎస్‌డీపీ, ఎస్‌టీపీ లైన్ పనులు నెలల తరబడి, కొన్ని ప్రాంతాల్లో మూడేళ్లుగా అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. సాంకేతిక లోపాల కారణంగా చిన్నపాటి వర్షానికే మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని వివరించారు.

పటేల్ చెరువు, ఎఫ్‌సీఐ కాలనీ, మియాపూర్ హెడ్ బ్యాంక్-నడిగడ్డ తాండ రహదారి, ముజఫర్ అహ్మద్ నగర్, టీఎన్ నగర్, చందానగర్-హైటెక్ సిటీ మంజీరా రోడ్డు, మక్తా మహబూబ్ చెరువు కట్ట మీదుగా బీకే కాలనీ వెళ్లే ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ పనుల కారణంగా రోడ్లు తవ్వి అలాగే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంసీపీఐ(యూ) నాయకులు తెలిపారు. అసంపూర్తి డ్రైనేజీ పనులను అత్యవసరంగా పూర్తి చేయడం, తవ్విన రోడ్లను నాణ్యమైన సీసీ లేదా బీటీ రోడ్లుగా పునరుద్ధరించడం, డ్రైనేజీ జామ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వినతిపత్రానికి స్పందించిన కమిషనర్ జి. సృజన, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంసీపీఐ(యూ) నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్‌తో పాటు కమిటీ సభ్యులు జి. శివాని, బి. విమల, ఇక్రాన్ షేక్, ఆకుల రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.





