మియాపూర్ ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించాలి: సీపీఐ డిమాండ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, సుమారు 550 ఎకరాల 39 గుంటల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేద ప్రజల సంక్షేమానికి వినియోగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వేలాది మంది నిరుపేదలు సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి టి. రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు కాకుండా పేదల అవసరాలకు ఉపయోగపడాలని, అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు ఇంటి స్థలాలు, గృహాలు అందించే ప్రక్రియను ఆలస్యం చేయకుండా చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో పేద ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here