నమస్తే శేరిలింగంపల్లి: అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్ మహిళ కార్యకర్త ఉమా దేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పించి ఆదుకోవాలని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ కార్యకర్త, చందానగర్ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్ ఆదిత్య నగర్ లో నివాసం ఉంటున్న ఉమా దేవి గత నాలుగైదు నెలల నుండి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నవత రెడ్డి పరామర్శించారు. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉమాదేవికి ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ ఉమా దేవి అనారోగ్య కారణంగా ఇప్పటికే రూ. 5 లక్షలకు పైగా అప్పు చేసి వైద్య చికిత్సలు చేయించినా కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. సీనియర్ టీఆర్ఎస్ మహిళ కార్యకర్తను ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరయ్యేలా చేసి ఆదుకోవాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగు దేశం రాష్ట్ర సమితి కార్యకర్తలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి లో మొదటి నుండి కష్టపడి పనిచేస్తున్న ఉమ దేవి లాంటి వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆదుకోవాలని నవత రెడ్డి డిమాండ్ చేశారు.