గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): చెట్టుకు టవల్‌తో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొండాపూర్ మసీదుబండ గ్రామ శివారు ప్రాంతంలోని గాఫర్స్ బస్తీలో శనివారం ఓ చెట్టుకు ఓ వ్యక్తి టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే స్థలంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారుగా 35 ఏళ్లు ఉంటుందని, అతను కూలి పని చేస్తూ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతను ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వంటి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.