శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): BHEL TOWNSHIP లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ A. కవిత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి నుండి రాజనీతి శాస్త్ర విభాగపు ఆచార్యులు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ హక్కులనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 10తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమును ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ‘మా హక్కులు, మన భవిష్యత్తు ఇప్పుడే’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1948 డిసెంబరు 10వ తేదీన 423(I) మానవ హక్కులపై తీర్మానానికి ఆమోదం తెలిపింది. అప్పటినుండి ప్రపంచ దేశాలన్నీ డిసెంబరు 10నాడు మానవ హక్కుల దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా మారిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ Dr అభిజిత్ , అధ్యాపకులు వి సత్యప్రకాష్ , ప్రజ్వల , జ్యోతిర్మయి విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.