నమస్తే శేరిలింగంపల్లి : ఇందిరా హిల్స్ కాలనీలో తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరా హిల్స్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల కోసం కాలనీలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు, మహిళలు తమ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్కువ ప్రెజర్ తో నీటిని వదులుతున్నారని విన్నవించుకున్నారు.
సరిపడా తాగునీరు విడుదల చేయడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యే కి తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే గాంధీ జలమండలి అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తాగునీటి సమస్యతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని జలమండలి అధికారులకు తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తయేలా చేస్తామన్నారు. కాలనీ క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశీనాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజు, మల్లేష్, పద్మారావు, కాలనీవాసులు పాల్గొన్నారు.