- షాపింగ్ మాల్స్ అక్రమ పార్కింగ్ లను తొలగించిన కూకట్ పల్లి సర్కిల్ 24 యంత్రాంగం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లో సౌత్ఇండియా షాపింగ్ మాల్ నుండి వివేకానంద నగర్ కమాన్ వరకు ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు ఏకాంత్ గౌడ్ హై కోర్టును ఆశ్రయించారు. వివేకానందనగర్ డివిజన్ లో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రోడ్డును ఆక్రమించి అక్రమ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని కూకట్ పల్లి జోనల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్ పల్లి మునిసిపల్ అధికారులు స్పందించకపోవడంతో ఈ సమస్యపై తెలంగాణ హైకోర్టులో 3వ తేదీన (WP:- 8842) కేసు వేశారు. ఈ మేరకు 10వ తేదీన హైకోర్టులో వాదనలు ఉన్నందున కూకట్ పల్లి సర్కిల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ లు షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసుకున్న అక్రమ పార్కింగ్ ను ఆగమేఘాల మీద తొలగించారు. ప్రస్తుత ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఏకాంత్ గౌడ్ అధికారులను కోరారు.