నమస్తే శేరిలింగంపల్లి: రహదారిపై వ్యర్ధాలను వేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధమైన పనులు చేపట్టిన ఓ భవన నిర్మాణ సంస్థకు జిహెచ్ఎంసి అధికారులు భారీ జరిమానా విధించారు. గచ్చిబౌలి లోని దివ్యశ్రీ ఓరియన్ సంస్థ అనుమతులు లేకుండా రహదారిపై భవన నిర్మాణ వ్యర్ధాలను వేయడంతో పాటు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పాడవ్వడానికి కారణమైంది. దీంతో పాటు నిర్మాణ సంస్థ చేపట్టిన పనుల కారణంగా రహదారిపై నీరు నిలిచిపోయింది. ఈ విషయంపై ఫిర్యాదులు అందుకున్న జిహెచ్ఎంసి ఎఎమ్ఒహెచ్ డా.ఎస్.రవి సిబ్బందితో కలిసి సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన దివ్య శ్రీ సంస్థకు రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. మరే ఇతర సంస్థలు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూరేలా వ్యవహరించకుండా ఉండాలని లేని పక్షంలో భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.