మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. గత కొంత కాలంగా ఈ వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ విషయం మరింత ఊపందుకుంది. త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ను ఎప్పుడు సీఎంగా ప్రకటిస్తారు ? అనే విషయంపైనే ఇప్పుడు సందేహమంతా నెలకొంది.
మంత్రి కేటీఆర్‌ను ఫిబ్రవరిలో సీఎంగా ప్రకటించవచ్చని ఒక వాదన తెరపైకి వస్తుండగా, కాదు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాకే కేటీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన సీఎం అయితే బాగుంటుందని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం చివరి అంకానికి చేరుకుందని తెలుస్తోంది.
ఒక వేళ కేటీఆర్‌ను అన్ని ఎన్నికల కన్నా ముందుగానే సీఎంగా ప్రకటిస్తే తరువాత ఆయా ఎన్నికల్లో తెరాస ఓటమి పాలైతే అప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కనుక అన్ని ఎన్నికలు ముగిశాకే కేటీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తే బాగుంటుందని ఆ పార్టీలో చాలా మంది నాయకులు అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. నిజానికి సీఎం కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన సంచలన నిర్ణయాలనే తీసుకుంటారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, లేదా సైలెంట్‌గానే ఉంటారో చూడాలి.