శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): వామపక్ష విద్యార్థి సంఘాలు ,యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ ఇవ్వని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకి మినిస్టర్ క్వార్టర్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 27 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయని, పీజీ హౌస్ సర్జన్లు చదువుతున్న విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే కళాశాలలో వివరాలు తెలుసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని అన్నారని తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న యువ వైద్యులకు దక్కాల్సిన కనీస హక్కులను ప్రైవేటు యజమాన్యాలు కాలరాస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ , అనగంటి వెంకటేష్, పిడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పీ మురళి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.






