శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మార్చి 17వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న చట్ట సభల్లో ఓంకార్ పాత్రపై రాష్ట్ర స్థాయి సభను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకురాళ్లు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప, విమల, శివాని, ఎం.డి సుల్తానా బేగం, రజియా బేగం, లలిత, అరుణ, గీత, జయలక్ష్మి, జయమ్మ, సరస్వతి పాల్గొన్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఏఐఎఫ్డిడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప మాట్లాడుతూ 2025 మే 12 నుంచి 2026 మే 12 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు, యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భంగా చట్ట సభల్లో ఓంకార్ పాత్రపై రాష్ట్ర స్థాయి సభను ఈనెల 17న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మద్దికాయల ఓంకార్ వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యుడిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంగా ఆనాటి రాజకీయ విలువలు, చట్టసభలలో ప్రజా సమస్యలపై ఓంకార్ ప్రదర్శించిన తీరును, అలాగే ప్రస్తుతం చట్టసభలలో జరుగుతున్న తీరును నెమరు వేసుకోవడానికి ఈ సభను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ తోపాటు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్లు కే ఆర్ సురేష్ రెడ్డి, సిరికొండ మదు సూదన్ చారి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి వి రాఘవులు, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ, మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నరసయ్య, వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, మేధావులు విద్యావంతులు, యువతీ యువకులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.






