వైభవంగా ముగిసిన ధర్మపురి క్షేత్రం శ్రీ విజయదుర్గా దేవి ఆలయ వార్షికోత్సవం

  • భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
  • భక్తి ప్రపత్తులతో 108 పూర్ణపు బుట్టలతో అమ్మవారికి వాయనం
  • 108 కలశాలతో జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడికి గంగాభిషేకం
  • మూడు రోజుల పాటు వేడుకగా జరిగిన పూజా కార్యక్రమాలు
  • పెద్ద ఎత్తున తరలివచ్చి మహోత్సవాన్ని జయప్రదం చేసిన భక్తులు
  • ప్రతీ  ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ధర్మపురి క్షేత్రం పాలకసేవా మండలి 
ధర్మపురి క్షేత్రంలో కొలువుదీరిన శాంభవి శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారు

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లోని దీప్తిశ్రీ నగర్ లోని ధర్మపురి క్షేత్రంలో శాంభవి శ్రీ విజయ దుర్గాదేవి 37వ వార్షిక మహోత్సవాలు 13వ తేదీన మొదలై మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. 36 వసంతాలు పూర్తయి 37వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి నేతృత్వంలో మహత్వ పూర్ణ మహోత్సవాలు మహదానందంగా మొదలయ్యాయి. ఈ భక్తి పూర్వక ఆరాధనా బ్రహ్మోత్సవాలకు భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాతకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారి వార్షిక మహోత్సవంలో పాల్గొన్న భక్తులు

శుక్రవారం ఉదయం 108 పూర్ణపు బుట్టలతో అమ్మవారికి వాయనం, 108 కలశాలతో జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వవరుడికి గంగాభిషేకం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నర్తకి రాజేశ్వర సాయినాథ, వైష్ణవి బృందం లలితా సహస్రనామ నృత్యప్రదర్శన పరవశింపజేసింది.

అమ్మవారిని వేడుకుంటూ..

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ.. దుర్గామాత అమ్మవారిని శరణు కోరితే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుందని, అమ్మను నిరంతరం జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులు కలుగుతాయని చెప్పారు. దుర్గముడనే రాక్షసుడిని ఎలా అంతమొందించిందో భక్తుల కష్టాలనూ అలాగే రూపుమాపుతుందని తెలిపారు. వార్షిక మహోత్సవాలను పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేసిన ప్రతీ ఒక్కరికీ ధర్మపురి క్షేత్రం పాలకసేవా మండలి ధన్యవాదాలు తెలిపింది.

అభిషేకానికి సిద్ధంగా ఉంచిన 108 కళశాలలోని గంగా జలం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here