నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సారీ మేళా, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్స్ జనంతో కిటకిట లాడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఆయా రాష్ట్రాలకు చెందిన 73 మంది చేనేత కళాకారులు విచ్చేశారు. మంగళగిరి భాగల్పూరి, చెందేరి, టస్సార్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తో పాటు చేనేత చీరలతో ఆర్టిసియన్స్ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యంపీ థియేటర్ లో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో వరంగల్ జిల్లాకు చెందిన వెంపటి శ్రావణి శిష్య బృందం పాల్గొంది. కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. వెంపటి వెంకట నారాయణ కాకతీయ నృత్య కళాక్షేత్రంలో శిక్షణ తీసుకుంటున్న కళాకారులు గణపతి స్తుతి, భామాకలాపం దరువు, భో శంభో శివ శంభో, త్యాగరాజ కృతి, దశావతార శబ్దం, రుక్మిణి ప్రవేశ దరువు, తరంగం, అన్నమాచార్య కీర్తన, జావళి, కొలువై ఉన్నాడే దేవదేవుడు, శివాష్టకం, బృందావని సారంగి థిల్లానా అంశాలను ప్రదర్శించారు. కౌశిక, నాగహర్ష, అక్షిత, అర్చన, జాగృతి,సంజన, అంజలి, వర్దిని , మౌనిక ప్రదర్శనలు ఆహుతులను మెప్పించాయి.