చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పూజకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని సెయింట్ థామస్ చర్చి వద్ద నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి జి.నాగరాజు పెద్ద కుమారుడు జి.బాలరాజ్ (32) ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో చందానగర్ శివాజీనగర్ ప్యాట్నీ సెంటర్‌లో పూజ కార్యక్రమం ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం అన్ని చోట్ల గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.